చుక్కమ్మ

చలం నాయికలలో అత్యంత ముద్దుకొలిపే చక్కనిది ఈ చుక్కమ్మ.  చుక్కమ్మ అనే కధలో ఈమెను మనకు చలం పరిచయం చేస్తారు.

ఈ కధ చదివిన చాలా రోజులకు కూడా నేను చుక్కమ్మను కొంచం కూడా మర్చి పోలేదు.

ఏ నాగరికతా సోకని స్త్రీ కి, ఆమె స్త్రీత్వానికి, కరుణకు, కల్మషం లేని ప్రేమకు ప్రతిరూపం ఈమె.

చుక్కమ్మ భర్త, ఇద్దరు పిల్లలతో తమ సొంతదైన కొద్ది భూమిలో నివసిస్తూ ఉంటుంది. భర్త తాగుబోతై ఎవరితోనో గొడవ పెట్టుకొని జైలు కి వెళ్తాడు. అతను తిరిగివచ్చే దాకా పొలం పనులు చూసుకొంటూ పిల్లల్ని పోషించుకొంటూ ఉంటుంది. ఒకసారి బర్రె గోతిలో పడటం, ఆ బర్రే తన పిల్లలకు పాలకు ఆధారం కావటం వల్ల తనకు అతి భారమైన పని కావటం వల్ల సహాయానికి కేక వేస్తుంది. దగ్గరలోని నదిలో పడవలో పోతున్న సర్వభద్రం  ఆమెను రక్షించి ఆమె పట్ల ఆకర్షణతో, జాలితో ఆమె కు సహాయం చేస్తూ ఆమెతో ఉండి పోతాడు.  తనను, తన పిల్లలను ఆకలి నుండి రక్షించి తమ పట్ల జాలితో ఎన్నో ఉపకారాలు చేసిన వ్యక్తి పై కరుణతో అతను కోరుకొన్న తన సౌందర్యాన్ని అర్పిస్తుంది చుక్కమ్మ. అతని ముందు తన భర్త తక్కువ కాకూడదని అతనికి అబద్దాలు చెప్తూ ఉంటుంది. ఇంతలో భర్త వస్తున్నట్లు  జాబు వస్తుంది. సర్వభాద్రాన్ని తన జీతగాడు గా పరిచయం చేసి అతన్ని ఇంటినుంచి సాగనంపి భర్తతో జీవిస్తూ ఉంటుంది.  చుక్కమ్మ భర్తకు ఏదో అనుమానం తగులుతూ నే ఉంటుంది.

అటు సర్వభద్రం ఆమె తో గడిపిన సమయాన్ని మధురం గా గుర్తుంచుకొంటూ తనవ్యాపకాల్లో పడి పోతాడు.  కాలక్రమేణా అతను సంపాదనా పరుడై ఒక బట్టల వ్యాపారి తో భాగస్వామ్యం పొందేందుకు డబ్బు కూడ  పెడతాడు.  ఇటు చుక్కమ్మ సంసారం పొలాలు పండక, తాగుడు ఎక్కువై ఇబ్బందుల్లో పడుతుంది. ఇట్టి పరిస్తితుల్లో చుక్కమ్మ భర్త ఆమెను సర్వభద్రం దగ్గరకు డబ్బు కోసం పంపుతాడు.  సర్వభద్రం చుక్కమ్మను పొంది తనకు డబ్బులు ఇస్తాడని అతని ఉద్దేశ్యం. చుక్కమ్మకు ఇలా ఆత్మాభిమానం లేకుండా అమ్ముడు పోయే పద్దతి నచ్చదు. మొగుడి బలవంతం పై వచ్చినా ఏడుస్తూ నన్ను నీకు అర్పించుకోవటానికి సిద్దం అంటుంది.

ఎంతో అభిమానంతో భర్త జైలు కి వెళ్ళాడని చెప్పటానికి, అతని గూర్చి చెడుగా చెప్పటానికి కూడా ఇష్టపడక, పిల్లల్ని స్వతంత్రంగా పోషించుకొంటూ కేవలం తన పట్ల కరుణతో, కృతజ్ఞతతో తనకు సౌఖ్యం అందించిన చుక్కమ్మకూ, ఈనాడు అవమానం తో ఏడుస్తున్న చుక్కమ్మకూ తేడా చూసిన సర్వభద్రం ఆమెను తాకకుండా ఆమెకు డబ్బు ఇచ్చి పంపుతాడు.  సర్వభద్రం తన భర్త ఊహిస్తున్నంత తక్కువ వాడు కాదు అనే నమ్మకం తప్పు కానందుకు సంతోషం గా చుక్కమ్మ తిరిగి వెళ్తుంది.

తెల్లని పాల వంటి చుక్కమ్మ మనసు మనందరినీ ఆకర్షిస్తుంది.  మనసుకి శరీరానికి గట్టి లంకె పెట్టుకొనే ఇలాంటి స్వచ్చమైన స్త్రీలే చలం దృష్టిలో ఆదర్శ స్త్రీలు.

1 comments:

  1. కొంతమంది అంటుంటారు "చలం మగవాళ్ళందరినీ విలనీకరించడానికి ప్రయత్నించాడు" అని. చలం గారి దృష్టిలో మగవాళ్ళందరూ విలన్లు కారు అని సర్వభద్రం గురించి చదివితే తెలుస్తుంది.

    ReplyDelete